తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు: టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిన్న ప్రారంభమయ్యాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ కోరింది.

సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ మరొకసారి తెలియజేసింది.

Share this post with your friends