తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత పెద్ద ఎత్తున జరిగే పండుగ నాగోబా జాతర. దీనికి దేశంలోనే రెండో అతి పెద్ద జాతరగా గుర్తింపు ఉంది. ఈ జాతర గత రాత్రి నుంచి ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే ఈ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ జాతర చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. నాగోబా జాతర ఉత్సవాలను 8 రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాన్ని మెస్రం కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్‌కు చేరుకున్నారు.
రాత్రి పది గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహించారు. మర్రిచెట్టు వద్ద వివిధ సంప్రదాయ పూజలు చేసిన మెస్రం వంశీయులు మంగళవారం రోజున డోలు, పెప్రే, కాళికొమ్ వాయిస్తూ నాగోబా ఆలయానికి వచ్చారు. ముందుగా మెస్రం వంశానికి చెందిన అల్లుళ్లు మర్రిచెట్టు వద్ద ఉన్న పవిత్ర కోనేటి నుంచి మట్టి కుండల్లో నీరు తోడుతారు. ఆడపడుచులు ఆ నీటిని ఆలయం ప్రాంగణంలోకి తీసుకువెళ్తారు. ఆడపడుచులు అదే మట్టితో కొత్త పుట్టను తయారు చేసి దాని నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలలో బౌల దేవతను ప్రతిష్టించారు. ఆ తరువాత సతీ దేవతల భౌలను తయారు చేశారు. ఆ దేవతల భౌలను సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తున్నారు.