
ముంబాదేవి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అసలు ముంబాదేవి పేరును ముంబైకి పెట్టడం వెనుక ఉన్న పురాణ కథ ఏంటంటే.. పూర్వం ఈ ప్రాంతంలో ముంబారక అనే భయంకరమైన రాక్షసుడు నివసించేవాడట. అతడు సామాన్యులనే కాకుండా దేవతలను సైతం హింసించేవాడట. దేవతలు ముంబారాకుని బాధల నుంచి ఉపశమనం కలిగించమని కోరుతూ ఆదిశక్తిని ప్రార్థించగా… ఆ ఆదిశక్తి ముంబా దేవిగా అవతారం ఎత్తి ముంబారకుడితో భీకర యుద్ధం చేసి అతడిని సంహరించింది. ముంబారకుడిని సంహరించింది కాబట్టి ఆమెను ముంబా దేవతగా పిలుస్తారు.
ముంబా దేవి గౌరవార్ధం ఈ నగరానికి ముంబయి అనే పేరు పెట్టారు. ఇది అతి పురాతన ఆలయం. దాదాపు 400 ఏళ్ల నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ‘కోలి’ అనే తెగ ప్రజలు నివసించారట. వారే ఈ ఆలయాన్ని నిర్మించారట. దీనిని మొదట బోరిబందర్ ప్రాంతంలో కట్టగా.. బ్రిటిష్ పాలనలో 1737లో భూలేశ్వర్ ప్రాంతానికి మార్చారు. అయితే బ్రిటిష్ కాలంలో ఈ నగరాన్ని బాంబే అని పిలిచేవారు. స్థానికులు మాత్రం ముంబయిగా పిలుచుకునేవారు. ఇక 1995లో ఈ నగరం బాంబే నుంచి ముంబయి అని అధికారికంగా పేరు మార్చుకుంది.
