పార్వతీదేవి స్వరూపమైన దేవతగా ముంబా దేవి..

మహారాష్ట్రలోని ముంబైలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఆలయాలున్నాయి. వాటిలో ముంబా దేవి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో పార్వతీదేవి స్వరూపమైన మరాఠీల దేవతగా ముంబా దేవి వెలిసింది. కొన్ని పౌరాణిక కథల్లోనూ వినిపించే ఈ ముంబాదేవి పేరు మీదుగానే ముంబై పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాకుండా సముద్రపు అలల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ముంబైని ముంబాదేవి కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ముంబాదేవిని ముంబైని కాపాడే పోషక దేవతగా అక్కడి వారు కొలుస్తారు.

ఇప్పట్లో అంటే ముంబై ఒక మెట్రో పాలిటన్ సిటీ కానీ ఒకప్పుడు అయితే ఇక్కడ వ్యవసాయం, చేపలు పట్టడం వృత్తిగా చేసుకుని అక్కడి వారు జీవించేవారట. అప్పుడు వీరందరికీ ముంబా దేవి రక్షణగా ఉండేదట. ఇప్పటికీ ముంబా దేవే ముంబై వాసులకు రక్షగా చెబుతారు. గర్భాలయంలో అమ్మవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. సింహ వాహనంపై వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో ఎర్రటి వస్త్రాలను ధరించి అష్ట భుజాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక అమ్మవారు తన ఎనిమిది చేతుల్లో రకరకాల ఆయుధాలతో మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తితో మొక్కితే చాలు.. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

Share this post with your friends