జనవరి 13న కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్‌(అలహాబాద్‌) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని భ‌జ‌రంగ దాస్ రోడ్డు, వాసుకీ ఆలయం ప్రక్కనే గల సెక్టారు 6 నందు శ్రీవారి ఆలయంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.

ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే టీటీడీ డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని టీటీడీ ఈవో తెలిపారు.

Share this post with your friends