
అమెరికాలోనూ భక్తిభావం వెల్లివిరుస్తోంది. సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలో మొదటిసారిగా డల్లాస్‌లో అన్నమయ్య సంకీర్తనోత్సవం పేరిట మహా బృంద గళార్చన కార్యక్రమాన్ని ఈ శనివారం (31వ తేదీ) అలెన్ కన్వెన్షన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక సన్నాహక సమావేశాన్ని ఇర్వింగ్‌లో తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గానూ ముందుగా చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తుడికి తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేయనున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి విరాళంగా 5 వేల డాలర్లు ఇచ్చిన వారిని మహారాజపోషకులుగానూ.. 2500 డాలర్లు ఇచ్చిన వారిని రాజపోషకులుగానూ.. 1116 డాలర్లు ఇచ్చిన వారిని పోషకులుగా గుర్తించనున్నారు. వారిని టీటీడీ వస్త్రంతో కార్యక్రమ నిర్వాహకులు సత్కరించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆరు వందల కీర్తనలను ఆలపించి అన్నమయ్యకు, శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అర్చన చేసేందుక ప్రవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే సంగీత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు.
