ద్వారకా తిరుమలలో 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలు..

ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈ నెలలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 27 న హిందువులందరికీ పవిత్ర పండుగ అయిన శ్రీకృష్ణ జన్మష్టమిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సందర్భంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నెల 28న ఆలయంలో ఊట్ల పండుగ, స్వామి వారి గ్రామోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. మహిళలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చిన వెంకన్న ఆలయంగా ద్వారకా తిరుమల చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా వెలిశాడు. వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతి గా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆమునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండడం చాలా అరుదు. తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకోలేని వారు ద్వారకా తిరుమలలో చెల్లించుకుంటూ ఉంటారు.

Share this post with your friends