విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయమే వైభవంగా దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమయ్యాయి. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో 500 మంది ముత్తైదువులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో అమ్మవారి సన్నిధానంలో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇంతమంది ముత్తైదువుల మధ్యలో వ్రతం చేసుకోవడం సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళా భక్తులంతా ఆచరిస్తున్నారు.
ఆగస్ట్ 16న రెండవ శ్రావణ శుక్రవారం.. పైగా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కావడంతో దాదాపు వీలున్న మహిళలంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. ఆ సమయంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సైతం వరలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులను కటాక్షించింది. ఇక ఇవాళ మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ అమ్మవారికి ఆర్జిత సేవలు నిర్వహించారు. అనంతరం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించారు. దీనికోసం మహిళలంతా ముందుగానే రూ.500 కట్టి వరలక్ష్మీ వ్రతానికి బుక్ చేసుకున్నారు. వారంతా నేడు వ్రతంలో పాల్గొన్నారు.