ఏడుపాయల అమ్మవారి పాదాలు తాకుతున్న మంజీర

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ముందు మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టు మూడు గేట్లు నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఏడుపాయల అమ్మవారి పాదాలు తాకుతూ మంజీర నది వెళుతుండంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ దృశ్యాన్ని చూసేందుకు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే అధికారులు ఆలయాన్ని మూసివేశారు. ఇక ఆలయ అర్చకులు అమ్మవారికి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.

ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో ఏడు పాయల నది ఒడ్డున వెలిసింది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. ప్రతీయేటా మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించకుంటారు. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తోంది.

Share this post with your friends