ఆహా ఏమి భాగ్యం.. రెండు సార్లు అలా దర్శనమివ్వనున్న శ్రీ మలయప్ప స్వామి

ఆగస్ట్‌లో తిరుమల వెళ్లాలనుకునే వారు వీటైతే ఆగస్ట్ 9, 19 తేదీల్లో వెళ్లేందుకు ప్రయత్నించండి. కారణమేంటంటే.. ఆ తేదీల్లో శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవ జరగనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఆగస్టు 9న గరుడ పంచమి

ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడపంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.

ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి

ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Share this post with your friends