మాఘపూర్ణిమ శ్రీ లలితా జయంతి.. అమ్మవారి ఆవిర్భావం వెనుక కథేంటంటే..

ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరిని రెండో స్వరూపంగా చెబుతారు. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత మాత్రమే కాకుండి పంచదశాక్షరీ మంత్రాధిదేవత కూడా కావడం విశేషం. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితాదేవి ఆవిర్భ వించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలు అని అర్థం. కాబట్టి పవిత్రమైన దైవకార్యాలూ చేయడానికి ఈ మాసాన్ని అత్యున్నతమైనదిగా చెబుతారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే “మహా మాఘి” అని కూడా అంటారు. ఈ రోజున లలితా జయంతి కూడా కావడం మరో విశేషం.

లలితా దేవి ఆవిర్భావం గురించి దేవీ పురాణం వివరిస్తోంది. భండాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే.. ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకోవడంతో శివుడు అనుగ్రహించాడు, వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తనసోదరులతో కలిసి మూల్లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక.. నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి, శ్రీచక్రాన్ని అధిష్ఠించి, భండాసురుణ్ణి సంహరించింది.

Share this post with your friends