తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని మాఘ పౌర్ణమి సందర్భంగా సందర్శించుకున్నారు. గోవింద నామ స్మరణతో తిరుమల మారుమోగింది.

తిరుమలలో వీకెండ్స్‌లో మాత్రమే ఎక్కువగా ఉండే భక్తుల రద్దీ బుధవారం అమాంతం పెరిగిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల పాటు స్వామివారి దర్శనానికి వేచి ఉండాల్సి వచ్చింది. తిరుమలలో గురువారం కూడా భక్తుల రద్దీ తగ్గలేదు. గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. టీటీడీ సైతం రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కంపార్ట్‌మెంట్లలో కూలర్లను ఏర్పాటు చేశారు.

Share this post with your friends