సాక్షాత్తు శ్రీరాముడే ఆ లింగాన్ని ప్రతిష్టించాడట.. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో ప్రతి ఒక్క ఆలయానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాంటి విశిష్టతల సమాహారమే కీసరగుట్ట. అక్కడ పరమేశ్వరుడు రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. దీనికి కారణం.. శ్రీరాముడి చేతి ప్రతిష్టించబడటమే. తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది కీసరగుట్ట. అయితే ఈ ప్రాంతానికి ఈ పేరు రావడం వెనుక రెండు కారణాలను చెబుతారు. వీటిలో ఒకటేంటంటే.. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు(సింహాలు) గుంపులుగా సంచరించినందు వల్ల ఇది కేసరగిరి అయ్యిందంటారు. మరో కారణం ఏంటంటే.. వానరరాజు కేసరిగిరి(ఆంజనేయుడి తండ్రి) నివాసం కావడంతో ఈ క్షేత్రం కేసరిగిరి అయ్యిందంటారు.

ఇక ఈ స్థల పురాణం ఏంటంటే.. రావణ సంహారం తర్వాత రాముడు సీతాదేవి, హనుమంతుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పులకించి, కొంతకాలం ఇక్కడ ఉండిపోయారు. ఆ సమయంలోనే రావణుని హతమార్చినందుకు హత్యా పాతక నివారణ కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని రాములవారు భావించారట. అనుకున్నదే తడవుగా కాశీకి వెళ్లి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. అయితే ప్రతిష్టించాలని అనుకున్న సమయానికి ఆంజనేయడు తిరిగి రాలేదట. దీంతో రాములవారు ఆ పరమశివుడినే ప్రార్థించి లింగరూపరధారియైన విగ్రహాన్ని పొంది.. మహర్షులు నిర్ణయించిన సమయానికి ప్రతిష్టించి పూజలు నిర్వహించి హత్యాపాతక నివారణ చేసుకున్నారట. ఆ తరువాత హనుమంతుడు నూటొక్క శివలింగాలతో అక్కడకు చేరుకున్నాడట. అప్పటికే రాములవారు శివలింగాన్ని ప్రతిష్టించడాన్ని చూసి కలత చెందాడట. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి తాను ప్రతిష్ఠించిన శివ దర్శనం అనంతరం కాశీ నుంచి తెచ్చిన నూటొక్క శివలింగాలను భక్తులు దర్శించేలా వరమిచ్చాడట. అదీ కీసరగుట్ట కథ.

Share this post with your friends