ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరంగా వారణాసికి పేరు. ఇదొక ఆధ్యాత్మిక నగరం. పైగా హిందువుల విశ్వాసం ప్రకారం ఈ నగరాన్ని స్వయంగా శివుడే నిర్మించాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరంతో పాటు ఆలయాన్ని దర్శిస్తే కేదార్‌నాథ్‌ను దర్శించిన దానికంటే 7 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందట. కాశీలోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి విశ్వేశ్వర థామ్. దీంతో పాటు చాలా ఆలయాలున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన ఆలయం కేదారేశ్వర మహాదేవ ఆలయం. సోనార్‌పురా రోడ్‌కు సమీపంలో ఉంది. వారణాసిలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఇదొకటి.
ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడే తొలుత శివలింగం కనిపించిందట. అన్ని ఆలయాలతో పోలిస్తే ఇక్కడి ఆలయ పూజా విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి బ్రహ్మణులు కుట్టని బట్టలు ధరించి స్వామివారికి హారతి ఇస్తారు. ఇక ఆ హారతి కూడా ఐదు నిమిషాలో లేదంటే పది నిమిషాలో ఉండదు. ఏకంగా నాలుగు గంటల పాటు ఉంటుంది. స్వయంభుగా ఇక్కడ శివుడు వెలిశాడు. ఈ శివలింగానికి ప్రతి రోజూ బిల్వపత్రాలు, పాలు, గంగా జలంతో అభిషేకిస్తారు. ఇక నైవేద్యంగా శివుడికి కిచిడీ సమర్పిస్తారు. ఈ కిచిడీని స్వీకరించేందుకు స్వయంగా శివుడే వస్తాడని నమ్మకం.