ఇక్కడి శివయ్యను రాత్రి వేళ అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు…

శ్రావణ మాసంలో శివ భక్తులు ముఖ్యంగా ఉత్తరాదివారు శివుడిని ఆరాధిస్తారు. ఈ మాసంలో శివుడిని దర్శించుకుని పూజలు చేస్తే చాలా మంచిదని భావిస్తుంటారు. అయితే ఒక్కో శివాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఓ శివాలయం ఉంది. అక్కడి ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఎక్కడి ఆలయంలో అయినా శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఇక్కడి శివాలయంలో శివుడికి ఎదురుగా పార్వతీ దేవి ఉంటుంది. అంటే శివాలయం తలుపు దగ్గర శివయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న మాట.

ఇక్కడి శివయ్యను గోపేశ్వరుడని పిలుస్తారు. ఈ పేరును సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే శివయ్యకు పెట్టాడట. ఇక ఇక్కడ పార్వతీ దేవి గర్భగుడి వెలుపల భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికీ అమ్మవారు ఎదురు చూస్తూనే ఉంటుందని ఇక్కడి వారి నమ్మకం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు. ముఖ్యంగా శరద్ పూర్ణిమ నాటి రాత్రి అయితే శివయ్యను అందమైన, ముచ్చటగొలిపే స్త్రీ రూపంలో అలంకరిస్తారు. ఈ సమయంలో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. స్వామివారి అనుగ్రహం పొంది ఆనందంగా తిరిగి వెళుతుంటారు.

Share this post with your friends