ఆలయం అక్కర్లేదని.. బాహాటంగా ఉంటానని గొర్రెల కాపరికి శని దేవుడు చెప్పాడట..

శని సింగనాపూర్ గురించి తెలిసిందే. శని దేవుడు కొలువైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం. దీని స్థల పురాణం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని , ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీంతో గొర్రెల కాపరి భయంతో ఊరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను శనీశ్చరుడినని, అద్వితీయముగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపాడట.

అప్పుడు సదరు గొర్రెల కాపరి.. స్వామిని ప్రార్థించి తాను ఆలయం ఎక్కడ , ఎలా నిర్మించాలో తెలుపమని కోరాడట. దీనికి సమాధానంగా శని దేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయ నిర్మాణమూ అక్కరలేదని , ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల , దోంగల , దోపిడిదారుల , కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. కాబట్టి శని సింగనాపూర్‌లో శనీశ్వరుడు గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట ఉంటాడు. అంతేకాదు ఈ ఊరిలో ఒకప్పుడు, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు , ఇళ్ళకు , ఆలయాలకు , చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు.

Share this post with your friends