హిందూ సంప్రదాయం ప్రకారం శైవులు, వైష్ణవులు ఉంటారు. శివారాధన చేసే వారిని శైవులని, వైష్ణవ మతాన్ని అవలంబించే వారిని వైష్ణవులని అంటారు. ప్రాచీన కాలంలో అయితే శైవులు, వైష్ణవుల మధ్య చాలా విభేదాలు ఉండేవి. కానీ ఇప్పుడలా లేదు. కాలం మారింది. భక్తుల ఆలోచనలో మార్పు వచ్చింది. భగవంతుడు ఒక్కడే అని.. ముఖ్యంగా హరిహరులకు భేదం లేదనే అభిప్రాయం సర్వత్రా వస్తోంది. అంతేకాకుండా హరిహరులిద్దరూ ఒక్కటేనని తెలపడానికి భగవంతుడు ఎన్నో లీలలు ఆవిష్కరించాడు.
నరసింహస్వామి అనగానే మనకు గుర్తొచ్చేది.. సింహం ముఖంతో, మానవ శరీరంతో కూడిన ఉగ్రరూపం. ఎక్కడైనా నరసింహస్వామి ఇలాగే దర్శనమిస్తాడు. కానీ దీనికి భిన్నంగా ఒకచోట లింగ రూపంలో దర్శనమిస్తాడు. అదెక్కడో తెలుసా? తెలంగాణలోనే. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సింగోటం అనే ప్రాంతంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి లింగ రూపంలో కొలువుదీరాడు. గర్భాలయంలో పిండి రుబ్బే పొత్రం సైజులో ఉన్న నరసింహ లింగాన్ని దర్శించవచ్చు.