వినాయక చవితి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నుంచి ప్రారంభమైన వేడుకలు పది రోజుల పాటు జరుగుతాయి. ఈ రోజున విఘ్నాలకధిపతి అయిన గణేశుడు జన్మించిన రోజు అని చెబుతారు. గణేషుడు జననం గురించి హిందువులందరికీ తెలుసిందే. పార్వతీ మాత స్నానానికి వెళుతూ పిండి ముద్దతో గణేషుడి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది. అలా వినాయకుడు జన్మించాడు. మరి గణేషుని జన్మస్థలం ఎక్కడుందో తెలుసా? దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది.
ఉత్తర కాశీకి సమీపంలో ఉన్న అందమైన సరస్సు దోడితాల్ సమీపంలో జన్మించాడు. ఈ ప్రాంతంలో గణేషుడి ఆలయం ఒకటి ఉంది. నేటికీ తన తల్లి పార్వతీ మాతతో కలిసి ఈ ఆలయంలో వినాయకుడు కొలువై ఉన్నాడని అక్కడి స్థానికులు నమ్ముతారు. ఇక్కడ పార్వతీ దేవి అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుంది. దోడితాల్ షట్కోణ సరస్సే ఒక పెద్ద మిస్టరీ. దీనిని ఛేదించడం ఇప్పటి వరకూ ఎవరి వల్లా కాలేదు. ఈ సరస్సు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. దీని లోతు ఎంత ఉందో ఇప్పటి వరకూ ఎంతో మంది యత్నించారు కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ సరస్సు సముద్ర మట్టానికి 3,657 మీటర్ల ఎత్తులో ఉంది.