నెల్లూరు జిల్లాలో కొలువైన అయ్యప్ప స్వామి క్షేత్ర విశేషాలు అన్నీ ఇన్నీ కావు. దీని స్థల పురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు వారు దక్షిణ భారతదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తూ తుమ్మగుంటలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారట. ఆయనకు కలలో అయ్యప్పస్వామి కనిపించి తాను జువ్వి చెట్టులో ఉన్నానని.. తనకు బ్రాహ్మణోత్తముల చేత పూజలు చేయించమని చెప్పారట. తను ఉన్న చోటు ఒక మామిడి తోటలో ఉందని.. అక్కడ సుగంధ ద్రవ్యముల సువాసనలతో విరాజిల్లుతుందని చెప్పాడట. అలాగే తనను దర్శించిన సమయంలో దివ్యకాంతులతో రాయలవారికి దర్శనమిస్తామని అయ్యప్పస్వామి చెప్పారట.
మేల్కొన్న వెంటనే రాయలవారు తనకు వచ్చిన కల గురించి కొందరు వేద పండితులకు చెప్పారట. అంతా విన్న వారు.. రాయలవారు చాలా అదృష్టవంతుడని.. స్వామి వారు కలలో మీకు దర్శనం ఇచ్చారు కాబట్టి స్వామి వారి ఆదేశానుసారం మనం ఆ మామిడితోటలో జువ్వి వృక్షాన్ని దర్శనం చేసుకుందామని మహారాజుకి తెలిపారట. వెంటనే రాయలవారు తన పరివారంతో కలిసి మామిడి తోటలో వెతుకగా దేదీప్యమైన కాంతులతో దివ్యమైన సుగంధ పరిమళాల సువాసనలతో విరాజిల్లే అయ్యప్పస్వామి దర్శనమిచ్చారట. ఆ వృక్షాన్నే అయ్యప్పస్వామిగా భావించి పూజలు చేశారట. అనంతరం కొందరిని అక్కడే ఉంటూ స్వామివారికి పూజలు చేస్తుండమని చెప్పి వారి జీవనోపాధి నిమిత్తం కొంత మాన్యమును కేటాయించి పరివారంతో రాయలవారు అక్కడి నుంచి వెళ్లిపోయారట.