
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంట వరకూ స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ఈ కపిల తీర్థంలో కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండలమీద 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి ఆకాశగంగ దూకుతుంది. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని వైష్ణవులు చక్రతీర్థమని పిలిచేవారు.
