శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా కుమారస్వామి తెప్పోత్సవం..

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన దైవం కుమారస్వామి. ఈ స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామిని అలంకార మండపంలో అద్భుతంగా అలంకరించారు. ఆపై మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివారిని నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి తెప్పలపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. విద్యుత్‌ దీపకాంతుల మధ్య పుష్కరిణిలో జరిగిన ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెప్పలపై విహరించిన కుమారస్వామిని దర్శించుకుని పులకించిపోయారు.

ఇక ఆడికృత్తిక వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తనకు ఇష్టమైన నెమలి వాహనంపై వళ్లీ దేవసేన సమేత కుమారస్వామి పురవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మొదట స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయ అలంకార మండపంలో విశేషంగా అలంకరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను చప్పరంపై తీసుకుని వాహన మండపానికి చేర్చి అక్కడ నెమలి వాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేశారు. అనంతరం నాలుగు మాఢ వీధుల్లో విహరింపజేశారు. ఊరేగుతున్న వళ్లీ దేవసేన సమేత కుమారస్వామికి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

Share this post with your friends