గంగాదేవి గర్భంలో పెరిగిన కుమారస్వామి.. ఆమె భరించలేకపోవడంతో..

మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు, మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే…. అదే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి , మూర్తీభవించిన అందం , తేజస్సు , చిరునవ్వు , అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, నను గన్న తండ్రి, భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు , సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత, ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి , అంత్యమున తనలో కలుపుకునే స్వామి… అటువంటి మన కుమారస్వామి అనుగ్రహ కటాక్షములు భక్తులు ఎల్లరకు కలగాలనీ, సుబ్రహ్మణ్యస్వామి వారు త్వరగా అవతరించాలనీ, ఈ జగత్తులోనూ.. మనలోనూ ఉన్న ఆసురీ, అవైదిక, అధార్మిక శక్తులను సంహరించి, ధర్మస్థాపనం చేయాలనీ స్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు , అనుగ్రహానికి ఐక్యరూపం – సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి , కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే. శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో , ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని , రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని , కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు.

Share this post with your friends