
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 18 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 6.30 నుండి 10.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తైన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఆలయ అర్చకులు శ్రీ నారాయణ చార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
