ఖైరతాబాద్ వినాయకుడు అందంగా ముస్తాబై కొలువు దీరిన విషయం తెలిసిందే. వినాయక చవితికి ఒక రోజు ముందు నుంచే గణపయ్య భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడు ఎలా ఉంటాడో చూడాలని భావిస్తూ ఉంటుంది. ప్రతి ఏడు ప్రత్యేకంగా రెడీ అవుతాడు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు హైదరాబాద్‌కు వస్తుంటారు. అంతలా ఖైరతాబాద్ వినాయకుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజ ఎప్పుడు జరుగుతుంది? ఎవరు హాజరు కానున్నారనే విషయాలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరించారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజకు హాజరు కానున్నారని దానం నాగేందర్ వెల్లడించారు. 11 గంటలకు తొలి పూజా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ హజరు కానున్నారని వెల్లడించారు. ప్రతి ఏడాది లాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని దానం నాగేందర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారని దానం నాగేందర్ వెల్లడించారు.