శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి

సాధారణంగా గుడికి వెళితే ముందుగా ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తాం. కొన్ని ఆలయాల్లో మొక్కుకు ముందు 11 ప్రదక్షిణలు.. మొక్కు తీరితే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆ తరువాతే వెళ్లి గుడిలో స్వామివారిని దర్శించుకుంటారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణ.. మిగతా దేవాలయాలలో చేసే ప్రదక్షిణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం.
లింగపురాణం ప్రకారం ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించి ఉంది.

శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. దీని ప్రకారం ప్రదక్షిణ ప్రారంభించాలి. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వద్దకు వెళ్లి.. తిరిగి అక్కడి నుంచి ధ్వజస్తంభం వరకూ వచ్చి ఆగాలి. తిరిగి ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ప్రదక్షిణ పూర్తవుతుంది. అక్కడి నుంచి వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లుగా భావించాలి. శివుడికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచే బయటకు పోతుంది. అంతేకాకుండా అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు. శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణ పది వేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణం చెబుతోంది. పొరపాటున కూడా నంది శివునికి మధ్యలో నడవకూడదు. ప్రదక్షిణ సమయంలో పొరపాటున కూడా గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేయకూడదు.

Share this post with your friends