పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా నవంబరు 4, 11, 18, 25వ తేదీలలో తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించనున్నారు.
డిసెంబరు 1న మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు చండీకేశ్వరస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. ఆ తరువాత పంచమూర్తులను పురవీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. ఈ మాసంలో కపిలేశ్వర స్వామివారిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో అర్చించినట్లయితే శివస్థానాన్ని పొందుతారని పురాణ ప్రశస్తి. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానం, పుణ్యయోగుల దర్శనం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని అర్చకులు తెలిపారు.