పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ్టి (నవంబరు 2) నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. ఇవాళ హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇవాళ్టి నుంచి 4వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవంబరు 8న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.
అదేవిధంగా నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఈ హోమాల్లో భాగంగా నవంబరు 7న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 29న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి.
హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ :
శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.