పెన్సిల్ లిడ్‌పై కొలువుదీరిన కన్నయ్య..

కన్నయ్యేంటి? పెన్సిల్ లిడ్‌పై కొలువుదీరడమేంటి అనుకుంటున్నారా? ఒక సూక్ష్మకళాకారిణి చేసిన అద్భుతమిది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెన్సిల్ ముక్కుపై బాలకృష్ణుడి రూపాన్ని అందంగా.. ఆకట్టుకునేలా చెక్కింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఎం నళిని చేతి నుంచి జాలువారిన అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ మైమరచిపోయి మరీ చూస్తున్నారు. బియ్యపు గింజపై, చాక్ పీస్‌పై.. పెన్సిల్ లిడ్ పై అనేక రకాల చిత్రాలు గీసి ఇప్పటికే నళిని ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఇక నిన్న శ్రీకృస్ణ జన్మాష్టమి సందర్భంగా ఎనిమిది మిల్లీమీటర్లు వెడల్పు.. ఒక సెంటిమీటర్ ఎత్తుల్లో నాలుగు గంటల పాటు శ్రమించి కన్నయ్య విగ్రహాన్ని చెక్కింది.

బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన నళిని కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ టైమ్ పాస్ కోసం తనలోని ప్రతిభకు మరింత పదును పెట్టింది. అలా అలా చాక్పీస్, పెన్సిల్, టూత్ పిక్‌లపై బొమ్మలు చెక్కడంలో నిష్ణాతురాలిగా మారింది. ఇప్పటికే ఆమె ఎందరో దేవుళ్లతో పాటు పలు ఆసక్తికర దృశ్యాలను చెక్కింది. బియ్యపు గింజ పై ఆంగ్ల అక్షరమాల.. చాక్ పీస్‌పై రైతు నాగలిని చెక్కారు. పెన్సిల్‌పై బుద్ధుడి ముఖం, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని సైతం చెక్కి ఔరా అనిపించుకుంది. శుద్ధ మొక్కపై ఆంజనేయస్వామి గదను చిత్రించింది. ఇక తాజాగా కన్నయ్యను చెక్కి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే నళిని తన విద్యతో ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సుప్రీం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సాధించింది.

Share this post with your friends