తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాల ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యంలో భక్తులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ధనంజయులు, శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.