సంక్రాంతి వేడుకల్లో తొలిరోజైన భోగి పండుగ గురించి తెలుసుకున్నాం కదా. ఈ భోగి పండుగ గురించి ఆసక్తికర కథనం ఒకటుంది. అదేంటంటే.. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునేనని చెబుతారు. అంతేకాకుండా.. ఇంద్రుడి పొగరును అణచివేస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అలాగే రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనమైన నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజేనని చెబుతారు.
అందుకే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు అయిన భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. భోగి పండుగ ఒక సందేశం కూడా ఇస్తోంది. అదేంటంటే.. సిరిసంపదలను పెంచుకోవడం కాదు నలుగురితో కలిసి పంచుకోడానికి అని చెబుతోంది. అందుకే ఈ నాటికీ పల్లెల్లో ఈ పండుగ సందర్భంగా ఒకరింట్లో పండిన పంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాకుండా కలిసిమెలిసి పిండి వంటలను వండుకుంటూ ఉంటారు. ఇలా పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేసేదే భోగి పండుగ. ఇంతటి ప్రాధాన్యత కలిగినది కాబట్టే దీనిని పండుగతో సమానంగా జరుపుకుంటాం.