తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం దురదృష్టకరమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దక్షిణ భారతంలో ఆలయాల సందర్శనకు పవన్ బుధవారం బయలుదేవారు. ఈ క్రమంలోనే ఆయన కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీఅగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని బుధవారం సందర్శించారు. పవన్‌కు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వరస్వామికి దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు గాయపడకూడదన్నదే తన అభిమతమని పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే తన బలమైన ఆకాంక్ష అని పవన్ పేర్కొన్నారు.
అనంతరం పవన్ విలేకరులతో మాట్లాడుతూ.. నెయ్యి కల్తీ వ్యవహారంలో పాత్రధారులను అరెస్టు చేయడం దర్యాప్తులో భాగమని.. ఇది సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రసాదం విషయంలో, ఇతర వ్యవహారాల్లో ఇక మీదట అయినా జాగ్రత్తలు పాటించాలని టీటీడీకి సూచించారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమని.. దీనికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. సుమారు నాలుగున్నరేళ్ల కిందట తను చెల్లించుకోవాల్సిన మొక్కులన్నీ.. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకున్నా వచ్చానని పవన్ పేర్కొన్నారు.. కేరళతోపాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.