భారతదేశంలో అనేక పురాతన, రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. వాటి రహస్యాలను ఛేదించడం ఎవరి తరమూ కాలేదు. అటువంటి అద్భుత, రహస్యమైన ఆలయం ఒకటి మధ్య ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ విశేషమేంటంటే ఈ ఆలయంలోని దీపాలు నూనెతో కాదు.. నీళ్లతో వెలుగుతున్నాయి. ఈ విచిత్రాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఎక్కడుందో తెలుసుకుందాం. షాజాపూర్ జిల్లాలో కలిసింద నది ఒడ్డున అగర్-మాల్వాలోని నల్ఖేడా గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో గడియా గ్రామానికి సమీపంలో ఉంది.
ఈ ఆలయంలో కొలువైన అమ్మవారిని గడియాఘాట్ వలీ మాతాజీ అని పిలుస్తారు. ఇక ఈ ఆలయంలోని మహా జ్యోతి ఏ రోజుకారోజు వెలిగించేది కాదు.. ఏళ్ల తరబడి ఈ ఆలయంలో మహా జ్యోతి మండుతూనే ఉంటుంది. మాతృ దేవత ముందు వెలిగే ఈ దీపం కోసం నూనె, నెయ్యి, ఇంధనం వంటివి ఏమీ వినియోగించరు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ దీపం ఆలయం కలసింద నది సమీపంలో ఉందని చెప్పుకున్నాం కదా.. కాబట్టి ఈ దీపం వెలిగించేందుకు కలిసింద నదిలోని నీటిని వాడుతారు. కలసింద నది నుంచి నీటిని తెచ్చి ఈ ఆలయంలో ఉంచిన దీపంలో పోస్తే.. అది జిగట ద్రవంగా మారి దీపం వెలుగుతుందని చెబుతారు.