కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన పెండ్లిమర్రి మండలంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. హిరణ్యకశ్యప సంహారం అనంతరం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంభుగా వెలిశారట. అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని దర్శించుకుని ఇక్కడకు వచ్చి స్వామివారిపై 16 సంకీర్తనలు రచించారట. ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే.. స్వయంగా నారద మహర్షి,తంబుర మహర్షి వారు ఇద్దరూ ప్రతిరోజు రాత్రి వేళల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని గర్భగుడికి వస్తారట. స్వామివారిని దర్శించుకుని అర్చన చేసి, తులసి దళాన్ని సమర్పిస్తారట.
ఇలా నారదుడు, తుంబురుడు వచ్చి అర్చన నిర్వహిస్తారని చెప్పేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అవి ఏమిటంటే ప్రతిరోజు ఆలయం గర్భ గుడి తలుపులు తెరిచిన వెంటనే తులసీదళాలు కనిపిస్తాయని అర్చకులు చెబుతున్నారు. రాత్రి వేళ గుడి శుభ్రం చేసి పూజారి గుడి మూసేసి వెళ్లిపోతాడట. మర్నాడు తెల్లవారుజామున స్వామివారి గర్భ గుడి తలుపు తెరిచి చూడగానే ప్రతిరోజు తులసి దళాలు కనిపిస్తాయట. స్థలపురాణాన్ని పరిశీలించిన ఆలయ అర్చకులు నారద మహర్షి వారు, తుంబుర మహర్షి వారు ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్వామివారికి తులసీ దళాలతో పూజలు చేస్తారని నమ్ముతున్నారు.