
సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించి ఆరు ప్రముఖ క్షేత్రాలున్నాయి. ఇవన్నీ కూడా స్వయంభువుగా వెలిసినవే కావడం విశేషం. వీటిలో ఒక్క క్షేత్రాన్ని సందర్శించినా కూడా ఆ వ్యక్తికి సంబంధించిన వంశమంతా సుఖశాంతులతో.. సిరిసంపదలతో తులతూగుతుందట. వివాహం కాని వారికి వివాహం.. సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని చెబుతారు. ప్రస్తుతం మనం తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుప్పన్ కుండ్రం గురించి తెలుసుకుందాం.
తిరుప్పన్ కుండ్రం ఎక్కడుందనే ముందుగా తెలుసుకుందాం. తమిళనాడులోని ప్రముఖ క్షేత్రాలలో మధురై అమ్మవారి క్షేత్రం ఒకటి. ఈ దేవాలయానికి 9 కి.మీ దూరంలో తిరుప్పరంకుండ్రం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామికి చెందిన ఆరు ప్రముఖ క్షేత్రాలలో తిరుప్పరంకుండ్రంను రెండవదిగా చెబుతారు. ఈ ఆలయ ప్రత్యేక ఏంటంటే.. ఇక్కడే ఇంద్రుని కుమార్తె దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కల్యాణం జరిగిందట. అంతేకాదు.. అన్ని ఆలయాల్లో మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి కూర్చొని దర్శనమిస్తారు. ఈ ఆలయం మినహా ఎక్కడైనా కూడా స్వామి నిలబడి మాత్రమే దర్శనమిస్తారు.
