నారద మహర్షి నిత్యం ఓ ఆలయంలో పూజ చేస్తాడట. నారదులవారిని బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, కలహాభోజనుడు అని పిలుస్తారు. అలాగే తుంబుర మహర్షి, నారద మహర్షి ఇద్దరూ నిత్యం రాత్రి వేళ ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి అర్చన చేసి, ఆయన పాదాల వద్ద తులసి దళాలను పెట్టి మరీ వెళతారట. అసలు ఆ ఆలయం ఎక్కడుందనేది ముందుగా తెలుసుకుందాం. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన పెండ్లిమర్రి మండలంలో ఉందా ఆలయం. దీనిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశారని చెబుతారు.
నరసింహ స్వామి అవతారంలో స్వామివారు హిరణ్యకశిపుడిని వధించిన కథ మనకు తెలిసిందే. హిరణ్యకశ్యప సంహారం అనంతరం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంభుగా వెలిశారని స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత జనమే జయ మహారాజు కాలములో ఈ క్షేత్రము నిర్మాణ దశను పూర్తిచేసుకుందని చెబుతారు. అచ్యుతరాయల వారు దండయాత్రకు వెళుతూ ఈ స్వామి వారిని దర్శించుకొని వెళ్లారట. ఆ యుద్ధంలో అచ్యుతరాయల వారు యుద్ధములో విజయం సాధించుకొని తిరిగి వచ్చారట. దీంతో స్వామివారికి కొంత మాన్యము భూమిని ఇచ్చినట్లుగా శాసనాలు ద్వారా తెలుస్తోంది.