
బోనాల పండుగ సమయంలో పోతరాజు గురించి వింటూనే ఉంటాం. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి ఆడుతూ ఉంటాడు. గ్రామ దేవతల పూజ ఏదైనా సరే ఆయనకు విశిష్ట స్థానం అయితే ఉంటుంది. అసలు ఈ పోతరాజు ఎవరంటే.. పురాణాల ప్రకారం శివుడే గ్రామ దేవతలకు రక్షకుడిగా ఈయనను నియమించాడట. పార్వతీ మాత సద్యోగర్భంలో 11 మంది జన్మించారు. ఈ అక్కచెల్లెళ్లకు (గ్రామదేవతలకు) ఏకైక తమ్ముడిగా పోతరాజును భావిస్తారు.
బోనాల పండుగ కానీ.. గ్రామ దేవత జాతరకానీ పోతరాజు లేకుండా వేడుకలు పూర్తి కావు. దుష్టశక్తులను తరిమి కొట్టే శక్తి పోతరాజుకు ఉందని చెబుతారు. చూసేందుకు బలశాలిగానూ.. స్ఫురద్రూపిగానూ పోతరాజు కనిపిస్తాడు. గ్రామ దేవతల వేడుకలో వేపాకులను నడుముకు చుట్టుకుని, కొరడాతో బాదుకొంటూ చూసేందుకు కాస్త భయం కలిగిస్తాడు. అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు. భక్త సమూహం ముందు నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే పూజా కార్యక్రమాలకు పోతరాజునే ఆరంభకుడిగా భావిస్తాడు.
