ఇక్కడి వెంకన్న ఆలయంలో దీపం వెలిగిస్తే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందట..

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాలు చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. అలాంటి వెంకన్న ఆలయాల్లో ఒకటి.. చిల్పూరు గుట్ట. ఇది తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి విశిష్టత ఏంటంటే.. ఈ స్వామివారికి మొక్కి ఆలయం వద్ద దీపం వెలిగిస్తే చాలు.. రుణ బాధలన్నీ తీరిపోతాయట. అందుకే ఆయనను “అప్పులు తీర్చే వెంకటేశ్వరుడు” లేదా “బుగులు వెంకటేశ్వర స్వామి”గా భక్తులు పిలుస్తారు.. ఈ స్వామిని దర్శిస్తే రుణ బాధలన్నీ తీరిపోయి ప్రశాంతంగా జీవిస్తారట.

ఇక్కడికి వచ్చిన వారంతా రుణ విమోచన దీపాన్ని వెలగిస్తారు. ఇదే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుందట. చిల్పూరు గుట్ట ఆలయంలో ఒక అఖండ దీపం ఉంటుంది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ దీపంలో నూనె పోసి వెలిగిస్తే రుణ బాధలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే రుణ బాధలన్నీ తీరిపోయిన తర్వాత భక్తులు తిరిగి ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇక్కడి వేంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకంలో పాల్గొన్నా చాలు.. మానసిక ప్రశాంతత చేకూరుతుందని నమ్మకం. ఇక శనివారం కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దానిలో పాల్గొంటే సకల బాధలూ తొలగిపోతాయని చెబుతారు.

Share this post with your friends