మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని షిండేకి కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న గణపతి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం 300 ఏళ్ల నాటిదని నమ్మకం. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. భక్తులు కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడి గణపతిని అర్జీవాలే గణపతి అని పిలుస్తారు. ఎందుకంటే అర్జీని పెట్టుకుంటే చాలు.. కోరిక నెరవేరుస్తాడట. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం అయితే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా పెళ్లి కాని యువతీయువకులకు ఇది ప్రత్యేకాలయం. ఈ ఆలయాన్ని పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు తమకు వివాహం జరిపించమని కోరడానికి గణపతి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ గణపతిని దర్శించడం వల్ల పెళ్లి జరగడంలో ఏమైనా అడ్డంకులుంటే అవి తొలగి వీలైనంత త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి వివాహంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తొలగించమని పెళ్లికాని యువతీయువకులు.. తమ దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగించమని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే సంతానం లేని వారు సంతాన భాగ్యం కోసం.. వ్యాపారంలో పురోభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం గణపతికి ఇక్కడ అర్జీ పెట్టుకుంటారు.