దేవతలందరిలోకి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వినాయకుడికి తొలి పూజ నిర్వహించిన మీదటే ఏ శుభకార్యాన్ని అయినా.. లేదంటే మరే పూజను అయినా నిర్వహిస్తూ ఉంటాం. దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వినాయకుడి ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు ప్రఖ్యాతిగాంచాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని షిండేకి కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న గణపతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైనది దీనికి మరింత ప్రాధాన్యత ఉంది.
ఈ ఆలయంలోని విఘ్నేశ్వరుడిని మొక్కుకుంటే కాదు.. కేవలం దర్శించుకుంటే చాలట. భక్తుల కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడి గణేశుడు చక్కగా నవ్వుతూ దర్శనమిచ్చి భక్తుల మదిలో ఆనందాన్ని నింపుతాడు. ఈ ఆలయం గురించి భక్తుల్లో ఒక నమ్మకం ఉంది. కోరిక కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచాడు. కాబట్టి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తమ కోరికలను చెప్పుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు. ఈ క్రమంలోనే భక్తులంతా తమ కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ ఆలయానికి వెళ్లి అర్జీ పెట్టుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని ‘అర్జీవాలే గణపతి’ మందిరం అని పిలుస్తారు.