బలి చక్రవర్తి గత జన్మ కథ గురించి మనం తెలుసుకుంటున్నాం. గత జన్మలో వేశ్యాలోలుడైన బలి.. తను మరణించే సమయంలో శివుడికి తన చేతిలో ఉన్న వస్తువులతో నివేదన చేస్తున్నట్టు ఊహించుకున్నాడు. దీంతో అతనికి మూడు గంటల పాటు ఇంద్ర పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. అలా మూడు ఘడియలు పూర్తయ్యాక అతడ్ని నరకంలో శిక్షించవచ్చని చిత్రగుప్తుడు చెప్పాడు. అది విన్న అతనికి తాను చేసిన పనులెంత ఘోరమైనవో అర్థమైందట. అప్పుడు కేవలం ఊహకే ఇంత మంచి ఫలితం వచ్చింది. కాబట్టి నిజంగా దానం చేస్తే ఎలా ఉంటుందోనని అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సర గణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఇంద్ర లోకానికి తీసుకెళ్లారు.
ఇంద్ర సింహాసనంపై కూర్చొన్న వెంటనే వరుసబెట్టి మహర్షులందరికీ దానం చేయగా సంతోషంతో అతన్ని వారంతా ఆశీర్వదించారట. ఆ తరువాత అక్కడికి వచ్చిన ఇంద్రుడు అన్నిటినీ దానం చేసిన వేశ్యాలోలుడిపై కోపంగించుకున్నాడు. ఆ పాపిని నరకానికి తీసుకెళ్లమని ఆదేశించగా చిత్ర గుప్తుడు అతనికి అది అవసరం లేదని మరు జన్మలో అతడు బలి చక్రవర్తిగా జన్మిస్తాడని చెప్పాడు. అయితే గత జన్మలో చేసిన పాప ఫలితంగా రాక్షస రాజుగా జన్మిస్తాడని చెప్పాడట. ఆ దాన ఫలితంగా అతను బలి చక్రవర్తిగా భూమిపై అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొంది పాతాళలోకానికి రాజయ్యాడు.