లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లo ఉన్నది వాస్తవం కాదు: టీటీడీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులంతా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఇటీవల వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందువులంతా అత్యంత పవిత్రంగా.. సెంటిమెంటుగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ వార్తలపై దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ఇంకా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఓవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి భక్తులను ఇంకా కలవర పెడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు లడ్డూ ప్రసాదం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నామని కల్తీకి ఇకపై ఆస్కారముండదని తేల్చి చెప్పారు.

అయినా కూడా శ్రీ మలయప్ప స్వామివారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై టీటీడీ తాజాగా స్పందించింది. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని తెలిపింది. తిరుమలలోని లడ్డు పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని టీటీడీ వెల్లడించింది. లడ్డూల తయారీ కూడా సీసీ వీల పర్యవేక్షణలో ఉంటుందని తేల్చి చెప్పింది. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని టీటీడీ పేర్కొంది.

Share this post with your friends