మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్‌లోనూ ఓ ఇస్కాన్ ఆలయ నిర్మాణం పూర్తైందని చెప్పుకున్నాం కదా.. ఈ ఆలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఆలయ ప్రధాన ద్వారాలకు ఉన్న తలుపులను వందల కిలోల వెండితో తయారు చేశారు. తలుపులపై శంఖుతో పాటు చక్రం జెండా వంటి వాటిని బంగారంతో చెక్కారు. గ్లోరీ ఆఫ్ మహారాష్ట్ర ప్రాజెక్ట్ కింద ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో దేశ విదేశాలకు చెందిన విగ్రహాలు, ఫోటోలు, పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 దేవాలయాలు ఉన్నాయి. ఇక ఆలయంలో దశావతార దేవాలయం ముందు పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో చాలా అందమైన ఫౌంటైన్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయం, దీని పైకప్పులపై అద్భుతంగా కళాఖండాలను చెక్కారు. తెలుపు, బంగారం, గులాబీ రంగులలో వాటిని అలంకరించారు. అంతేకాకుండా ఆలయంలో శాఖాహార రెస్టారెంట్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. అలాగే కన్నయ్య ఇష్టమైన వంటకాలను ఈ రెస్టారెంట్‌లో వడ్డిస్తారు. దీనిలో ఒక్కసారే మూడు వేల మంది భక్తులు కూర్చునేందుకు ఒక ఆడిటోరియాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొత్తంగా ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఆవిర్భవించనుంది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు.