అయ్యప్ప స్వామికి వివాహమైందా? పూర్ణ, పుష్కళలు ఎవరు?

అయ్యప్ప స్వామి కారణజన్ముడు. మహిషి అనే రాక్షస సంహారం కోసం అయ్యప్పగా హరిహరసుతుడు అవతరించాడు. ఆయన బ్రహ్మచారి అన్న విషయం తెలిసిందే. సవతి తల్లి కోరిక మేరకు పులిపాలను తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లిన సమయంలో అయ్యప్పస్వామి తాను మహిష సంహారం కోసం జన్మించానని నారదముని ద్వారా తెలుసుకుంటాడు. ఆ తరువాత ఆకాశ మార్గాన వెళుతున్న మహిషి గర్జిస్తూ మణికంఠునిపై దాడి చేస్తుంది. అప్పుడు మణికంఠుడు దానిని సంహరిస్తాడు. మరణానంతరం మహిషి శరీరం కొండలా పెరిగిపోయిందట. ఆమె కార్చిన కన్నీరు అళుదా నదిగా మారిందని చెబుతారు.

మహిషి కళేబరం పెరిగిపోవడంతో దానిపై రెండు రాళ్లను వేసి అదిమిపట్టి అయ్యప్ప స్వామి నృత్యం చేశాడు. ఆ నృత్యాన్ని చూడటానికి పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి వచ్చారట. నందీశ్వరుడిని కాలైకట్ట వద్ద ఉంచి వారు అయ్యప్ప నృత్యాన్ని చూసి ఆనందించారట. స్వామి పాదస్పర్శతో మహిషి పునీతురాలైంది. ఆ తరువాత తనను వివాహం చేసుకోమని అయ్యప్పను కోరగా ఆయన నిరాకరించాడు. అయితే ఆమెను ముగురమ్మలకు ప్రతిరూపంగా మాలికాపురత్తమ్మ పేరుతో అందరూ సేవించుకునేట్లుగా అయ్యప్ప స్వామి వరాన్ని అనుగ్రహించాడు. అయినా సరే మహిషి పట్టు వీడలేదు. తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అప్పుడు కన్నెస్వామి ఒక్కరు కూడా తనను దర్శించుకునేందుకు రాని ఏడాది ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో ప్రతి ఏటా మాలికాపురత్తమ్మ ఎదురు చూస్తూనే ఉందని చెబుతారు. మరి అంతటి బ్రహ్మచారికి పెళ్లి అంటారేంటంటారా? ఆయన ధర్మశాస్తా పేరుతో అవతరించినప్పుడు వివాహం చేసుకున్నాడు. ధర్మశాస్తా భార్యలే పూర్ణ, పుష్కళ.

Share this post with your friends