చాలా మంది వంట గదిలోనే దేవుడి గదిని కూడా ప్రతిష్టించుకుంటూ ఉంటారు. ఇప్పుడు గదులు సరిపడనంత లేకపోవడంతో వంట గదిలోనే ప్రత్యేకంగా దేవుడి కోసం ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసి అక్కడ దేవుడి పటాలను పెడుతుంటారు. వాస్తు ప్రకారం పూజ గదిని వంట గదిలో ఏర్పాటు చేసుకోవడం ఎంత వరకూ సమంజసం? అసలు పూజ గది ఎక్కడ ఉంటే మనకు మంచి జరుగుతుంది? అనే విషయాలను చూద్దాం. సాధారణంగా దేవుడి గది ఇతర గదులకు దూరంగా.. శబ్దాలు ఎక్కువగా వినిపించని చోట ఉండాలట.
నిత్యం భగవంతుడిని పూజించడం వలన మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని అంటారు. అలాంటి ప్రశాంతత చేకూర్చే పూజ గది ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. దానిని అందంగా అలంకరించుకోవాలి. ఇంట్లో నిత్య పూజ కారణంగా మన ఇంట పాజిటివ్ శక్తి నెలకొంటుంది. సాధారణంగా పూజ గది ఇంటికి ఈశాన్య మూల కానీ లేదంటే తూర్పు లేదా ఉత్తర మూల్లలో ఉంటే చాలా మంచిదట. పూజకు అనుకూలమైన దిక్కుల్లో దేవతా విగ్రహాలు పెడితే ఇంట సానుకూల శక్తి నెలకొంటుందట. వంట గదిలో రకరకాల వంటలు చేస్తుంటాం కాబట్టి పూజ గది.. వంట గదిలో లేకపోవడమే మంచిదని పండితులు చెబుతారు.