రంగనాథస్వామి ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర కథ..

మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి ఆలయంలో ప్రస్తుతం వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గాజులమ్మగానూ పిలిచే ఈ దేవిని సంతానప్రదాయినిగానూ భక్తులు కొలుస్తూ ఉంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమ్మవారే కోరి మరీ ఈ ఆలయాన్ని కట్టించుకుందని అంటారు. ఆలయ స్థల పురాణం ఏంటంటే.. ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పల దేశికుడు, అలివేలమ్మ అనే దంపతులుండేవారు. వీరికి కొడుకు పుట్టాక రాయపురం అంటే ఇప్పటి ఏదులాబాద్‌కు చేరుకున్నారట. కొడుకుకు సైతం అప్పల దేశికుడు అనే పేరే పెట్టుకున్నారట. కొన్నాళ్లకు అప్పల దేశికుడు మరణించాడట. దీంతో వారి కుమారుడైన దేశికుడు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్లాడట.

ఈ క్రమంలోనే అప్పల దేశికుడికి ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగిందట. ఈ క్రమంలోనే ఓ సారి రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్లగా అదే రోజు రాత్రి అతనికి కలలో గోదాదేవి కనిపించిందట. తనకు రాయపురంలో గుడి కట్టించమని చెప్పిందట. నిద్రలేచేసరికి అతనిఎదురుగా ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందట. ఇక ఆలయ నిర్మాణం ఎలా చేయాలా? అని ఆలోచిస్తుండగా.. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జమీందార్లు వచ్చి… తమకు ముందురోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి డబ్బు ఇవ్వమని ఆదేశించినట్లుగా చెప్పారట. అలా ఏదులాబాద్‌లో అప్పల దేశికుడు అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడట. ఇలా అమ్మవారే కోరి మరీ తన ఆలయాన్ని నిర్మింపజేసుకుందట.

Share this post with your friends