
సూర్యుని సప్త కిరణాల గురించి తెలుసుకున్నాం కదా. బ్రహ్మపురాణంలో ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది. సూర్యుడి ఏడో రూపమైన భగుడు జీవుల శరీరంలో ఉష్ణరూపంగా (వేడి) కామాగ్నిగా నెలవై ఉన్నాడు. సూర్యుడు ఆరు ఋతువుల్లో ఏడు రంగుల్లో కనిపిస్తాడు. జన్మించిందీ సప్తమినాడే. కనుకనే సూర్యుడికి సప్త సంఖ్యతో అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడు ఒక్కో నెలలో ఏడు వర్ణాలకు(కులాలు) చెందినవారితో కలిసి పయనిస్తాడు. ఉదాహరణకు మాఘమాసంలో త్వష్ట అనే దేవత, జమదగ్ని అనే విప్రుడు, ధృతరాష్ట్ర అనే గంధర్వుడు, తిలోత్తమ అనే అప్సరస, రుతజిత్తు అనే యక్షుడు, కంబళుడు అనే నాగజాతి వ్యక్తి, బ్రహ్మోపేతుడనే రాక్షసుడు- వీరితో కలిసి నడుస్తాడు.
అంటే కుల-మత-వర్గ-జాతి భేదాలు లేవు. ఆ కాంతి అందరిపైనా ఒకేలా ప్రసరిస్తుంది. యజమాని బుద్ధిశాలి అయితే వికలాంగులతోనూ అద్భుత కార్యాలు చేయించగలడు. అందుకు నిదర్శనమే తొడలు లేని అనూరుడిని రథసారథిగా నియమించుకుని కూడా నిరంతరం కోట్ల మైళ్లు ప్రయాణిస్తున్నాడు. సృష్టిలో పనికిరానిదంటూ లేదని, దేన్నయినా ఉపయోగించుకునే సామర్థ్యాలను పెంచుకోవాలని పరోక్షంగా సందేశాన్ని ఇస్తున్నాడు. భూలోక కాల విభజనకు సూర్యుడే ఆది బిందువు. ఋతువులను కల్పించేదీ, వాటిని నియంత్రించేదీ సూర్యుడే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాల పరోక్ష రూపాలే సృష్టి, స్థితి, లయ. ఈ మూడు కాలాలను సూర్య రథపు ఏక చక్రం అనుసంధానిస్తుందని విష్ణుపురాణ కథనం. భాగవతంలోనూ సూర్యుడి కాల కర్తృత్వం వర్ణితమైంది.
