ఆ రెండు గ్రామాల్లో టపాసులు అస్సలు పేలవు.. కారణమేంటంటే..

దేశమంతా దీపావళి వస్తుందంటే చాలు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటుంది. ఈ సంబరాలు దీపావళికి మూడు రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. కుల, మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటిది రెండు గ్రామాల్లో మాత్రం టపాసుల మోతే వినిపించదు. తమిళనాడు శివగంగ జిల్లాలోని కొల్కుడ్​పట్టి, వెట్టంగుడిపట్టి గ్రామస్థులు దీపావళికి టపాసులు కాల్చరు. ఇలాంటి నిర్ణయాన్ని ఆ ఇరు గ్రామాల వారు తీసుకోవడం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం.

కొల్కుడ్‌పట్టి గ్రామ పరిసరాల్లోని వెట్టంగుడి అభయారణ్యానికి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తున్నాయి. అవి అక్కడే ఉండి పిల్లల్ని కూడా కంటాయి. ఇవి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో వస్తాయి. స్విట్జర్లాండ్​, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి వెట్టంగుడి అభయారణ్యానికి దాదాపు 15 వేల పక్షులు వలస వస్తాయి. వీటి వలస సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి వరకూ వస్తూనే ఉంటాయి. గ్రే హెరాన్‌లు, డార్టర్‌లు, కామన్ టీల్స్ సహా మరో 5 నుంచి 10 రకాల వలస పక్షులు వస్తాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యానికి దాదాపు 50 ఏళ్లుగా 200 జాతుల వలస పక్షులు వస్తున్నాయట. వాటికి ఇబ్బంది కలగకూడదని గ్రామస్తులు టపాసులు పేల్చకూడదనే నిర్ణయానికి వచ్చారు.

Share this post with your friends