ఈ ఆలయంలో దేవతని కళ్లకు తెల్లని క్లాత్ కట్టుకుని మాత్రమే దర్శించుకోవాలట..

భారతదేశం ఒక ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ ఆలయాలకు కొదువేమీ లేవు. ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక ఆలయం ఉంటుంది. అయితే వాటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్‌లోని మౌంట్‌ ఆబూకి అతి సమీపంలో అంబాజీ పట్నం వద్ద ఉంటుంది. అక్కడకు వెళ్లిన వారంతా తప్పక అంబాజీ ఆలయాన్ని దర్శించుకుంటారు. కాంచీపురానికి మనం వెళితే ఎన్నో ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాం. ప్రతి ఆలయం కూడా మనకు ఏదో ఒక ప్రత్యేకతతో దర్శనమిస్తూ ఉంటుంది. అంబాజీ పట్నం కూడా ఈ కోవకు చెందినదే. 1500 ఏళ్లనాటి ఓ ఆసక్తికరమైన ఆలయం అంబాజీ పట్నంలో ఉంది. ఇక్కడ సతీదేవి హృదయం పడిందట. ఆరావళీ పర్వతాల నడుమ ఉంటుందీ అంబాజీ ఆలయం.

మరి అంబాజీ పట్నంలో ఏ ఆలయం ఉంటుందంటారా? ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి ఆలయంలో అమ్మవారి విగ్రహమేదీ ఉండదు. ఆ స్థానంలో బీజాక్షరాలు లిఖించిన ఒక శ్రీయంత్రం మనకు కనిపిస్తుంది. అయితే మరో విషయం ఏంటంటే.. ఈ శ్రీయంత్రాన్ని అదేపనిగా చూడకూడదట. మరి చూడకుండా ఉండటమెలా? అంటే.. శ్రీయంత్రాన్ని పూజించుకోవాలనుకునే భక్తులు ముందుగా తెల్లని వస్త్రంతో తమ కళ్లకు కప్పుకోవాలట. ఇది ఆలయ నిబంధన. ఇక అంబాజీ పట్నంలో గబ్బర్‌ కొండ, కోటేశ్వర ఆలయం, సరస్వతీ నది ఉద్భవించిన చోటు, వాల్మీకి ఆశ్రమం, అమ్మవారి సోదరి అజయ్‌దేవి ఆలయం, కైలాస కొండ తదితర పుణ్యక్షేత్రాలున్నాయి.

Share this post with your friends