ఈ రెండు ఆలయాల్లో దేవుడికి మందు, మాంసమే నైవేద్యం

ఆలయానికి వెళుతున్నామంటేనే మాంసాహారం స్వీకరించం. కానీ కొన్ని ఆలయాల్లో మాంసమే దేవుడికి నైవేద్యం. అలాంటి రెండు ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఎన్నో ఆలయాలున్నాయి. ఆ ఆలయాల్లో ఒకటి కాల భైరవుని ఆలయం. ఇక్కడి దేవుడికి మందుతో పాటు మాంసం, చేప వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. దేవుడికి వీటిని సమర్పించిన మీదట భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఇక్కడి స్వామివారిని ఉజ్జయిని సంరక్షుడిగా స్థానికులు బావిస్తారు. ఈ ఆలయం ఈనాటిది కాదు.. బద్రసేనన్ రాజు నిర్మించినట్టు చెబుతారు. ఈ ఆలయంలో తాంత్రిక ఆరాధన జరుగుతుంది. శైవ సంప్రదాయంలోని ఎనిమిది భైరవులలో ఈ కాల భైరవ ప్రధానమైనవాడు.

ఇక తమిళనాడు తిరుమంగళలోని వడక్కంపట్టి గ్రామంలోనూ ఇదే తంతు. ఈ గ్రామంలో మునీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని మునీశ్వరుడికి మటన్ బిర్యానీని నైవేద్యంగా పెడుతుంటారు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు.. 85 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం జనవరి 25న మూడు రోజులు పాటు మునీశ్వరుడి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల సమయంలో పెద్ద మొత్తంలో మటన్ బిర్యానీ వండుతారు. ఈ ఉత్సవాల్లో 2000 కేజీల బాస్మతి రైస్‌, మటన్‌తో బిర్యానీ తయారు చేస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉత్సవాలకు వచ్చే భక్తులకు మటన్ బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు.

Share this post with your friends