ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లు స్వర్ణ రథాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి సమక్షంలో ఈ స్వర్ణరథోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఈ స్వర్ణరథాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీరు కూడా నిన్న జరిగిన రథోత్సవానికి హాజరయ్యారు.
ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగానే గురువారం వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. అనంతరం అర్చక స్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించిన అనంతరం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ మహాద్వారం ముందు భాగం నుంచి ప్రారంభమైన స్వర్ణ రథోత్సవం ఆలయ నాలుగు మాడవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ప్రదర్శించారు.